అమాయకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య: ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన

  • ఘటనను తీవ్రంగా ఖండించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
  • ఈ దాడి అత్యంత దుర్మార్గమన్న అసదుద్దీన్ ఒవైసీ
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి డిమాండ్
  • అమర్‌నాథ్ యాత్ర సమీపిస్తున్న వేళ ఘటనపై ఆందోళన
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు.

సైనిక దుస్తులు ధరించి వచ్చి అమాయక ప్రజల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని అన్నారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ దుశ్చర్యకు బాధ్యులైన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

జమ్మూకశ్మీర్, అనంత్‌నాగ్‌ జిల్లా పరిధిలోని పహల్గాంలో మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 'మినీ స్విట్జర్లాండ్'గా పేరుగాంచిన బైసరన్ ప్రాంతంలో పర్యటిస్తున్న వారిపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో దాదాపు 40 మంది పర్యాటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు.

కాల్పుల శబ్దంతో అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. 

అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పహల్గాం మీదుగా ప్రయాణిస్తారు. యాత్రకు సమయం దగ్గర పడుతున్న వేళ, పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడటం స్థానికంగా, దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

Asaduddin Owaisi
Jammu and Kashmir Terrorist Attack
Pahalgham Attack
Terrorism in India
Tourist Attack
Owaisi Condemns Attack
India Terrorism
Kashmir Violence
Militants Attack Tourists

More Telugu News